మాల్దీవుల(Maldives) అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు.. భారత పర్యటనకు విచ్చేశారు. నాలుగు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ఆయన పలు కీలక సమావేశాలకు హాజరుకానున్నారు. నాలుగు నెలల్లో ఆయన భారత పర్యటనకు రావడం ఇది రెండో సారి. అయినా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం చేస్తున్న పర్యటన మాత్రం ఇదే మొటిది. ప్రధాని నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారానికి ముయిజ్జు విచ్చేసి ఉన్నారు. ముయిజ్జూ పర్యటన అక్టోబర్ 10 వరకు కొనసాగనుంది. ఈ పర్యటనలో భాగంగా ముయిజ్జూ.. భారత రాష్ట్రపతి ద్రైపదీ ముర్మూ, ప్రధాని మోదీ సహా పలువురు కేంద్రమంత్రులతో కూడా భేటీ కానున్నారు. ఇరు దేశాల అభివృద్ధికి సంబంధించి అనేక విషయాలను చర్చించనున్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ వ్యవహారాలపై పరస్పర అభిప్రాయాలను పంచుకోనున్నారు.
ముయిజ్జు(Mohamed Muizzu) పర్యటనలో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ అంశాలతో పాటు పలు అంశాలపై చర్చించనున్నట్లు కేంద్రమంత్రిత్వశాఖ వెల్లడించింది. ‘‘ముంబై, బెంగళూరులో జరిగే వ్యాపార కార్యకలాపాలకు ముయిజ్జు హాజరవుతారు. హిందూ మహాసముద్రంలో భారత్‌కు మాల్దీవులు(Maldives) కీలక పొరుగు దేశం. ప్రధాని మోదీ దృక్పథమైన ‘సాగర్ విధానంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది’’ అని విదేశాంగ మంత్రిత్వశాఖ వివరించింది.