లోక్‌సభ ఎన్నికలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది డిసెంబర్‌లోనే సార్వత్రిక ఎన్నికలు ఉండొచ్చని ఆమె జోస్యం చెప్పారు. ప్రచారం కోసం ఇప్పటికే అన్ని హెలికాప్టర్లను బీజేపీ ముందస్తుగా బుక్ చేసుకుందన్నారు. మరో పార్టీకి అవకాశం ఇవ్వొద్దనేది కమలం నేతల ఆలోచనగా చెప్పారు మమతా. తృణమూల్ కాంగ్రెస్ యువజన విభాగం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మాట్లాడిన మమతా బెనర్జీ..బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే దేశంలో నియంతృత్వ పాలనేనని ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్‌లో సీపీఎం పాలనకు ముగింపు పలికినట్లుగానే.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించి తీరుతామన్నారు.బీజేపీ విభజించు-పాలించు అనే సూత్రాన్ని పాటిస్తోందన్నారు. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే దేశంలో పరిస్థితులు దారుణంగా ఉంటాయన్నారు. ఇక బెంగాల్ గవర్నర్ తీరుపైనా మమత(Mamata Banerjee) నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వంతో సవాలుకు దిగొద్దని సూచించారు. గవర్నర్ పదవి అంటే తనకు గౌరవం ఉన్నప్పటికీ..ఆ పదవిలో ఉన్న వ్యక్తి తీరు మాత్రం సరిగ్గా లేదన్నారు.
దర్యాప్తు సంస్థలు తన కుటుంబీకులను రోజూ ఇబ్బంది పెడుతున్నాయన్నారు. తన మేనల్లుడు, లోక్‌సభ ఎంపీ అయిన అభిషేక్ బెనర్జీని ఎన్నికల ముందు అరెస్టు చేసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తనకు ఓ సందేశం పంపారని చెప్పారు. ఇక ఇటీవల జాదవ్‌పూర్ యూనివర్సిటీలో చోటు చేసుకున్న వివాదంపైనా స్పందించారు మమతా. గోలిమారో అంటూ నినాదాలు చేసిన వారిని తప్పకుండా అరెస్టు చేస్తామని మమత హెచ్చరించారు.