మహారాష్ట్ర రాజధాని ముంబై(Mumbai)లోని శాంటాక్రజ్ ఏరియాలోగల గెలాక్సీ హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఫైరింజన్‌లతో మంటలను ఆర్పేశారు. ఆ తర్వాత హోటల్‌లోని గదుల్లో చిక్కుకున్న వారిని బయటికి తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు ఐదుగురు క్షతగాత్రులు వెలికితీశారు. వారికి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సజీవ దహనమైన ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.