జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో(Jammu Kashmir Assembly) యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది. ఇరు పక్షాల ఎమ్మెల్యేలు బాహాబాహీ కావడమే ఇందుకు కారణం. ఇద్దరూ కూడా ఒకరిపైఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. దీనంతటికి ఆర్టికల్ 370నే మూలకారణం. ప్రస్తుతం జరుగుతున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టికల్ 370 పునరుద్దరణ అంశంపై తెరపైకి వచ్చింది. అసెంబ్లీ కార్యక్రమాలు ప్రారంభం కాగానే ఇంజినీర్ రషీద్ సోదరుడు, ఎమ్మెల్యే ఖుర్జీద్ అహ్మద్ షేక్.. ఆర్టికల్ 370ని పునరుద్దరించాలంటూ బ్యానర్‌ను ప్రదర్శించాడు. ఆయన చర్యలపై ప్రతిపక్ష బీజేపీ నేత సునీల్ శర్మ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఖుర్షీద్ ప్రవర్తిన సరైనది కాదని, కావాలంటే ఆ అంశంపై చర్చించాలే కానీ ఇలా అసెంబ్లీలో బ్యానర్లు ప్రదర్శించడం సభా మర్యాద అనిపించుకోదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది.
Jammu Kashmir Assembly | వాగ్వాదం కాస్తా కొట్లాటకు దారితీసింది. ఎమ్మెల్యేలు ఇద్దరూ కూడా ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లి పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఈ అంశంపై జమ్మూకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీంద్ర రైనా ఘాటుగా స్పందించారు. ‘‘ఎన్‌సీ, కాంగ్రెస్ పార్టీ దేశ విద్రోహ శక్తులకు ఆశ్రయం ఇస్తున్నాయి. కాంగ్రెస్.. పాకిస్థాన్‌తో చేయి కలిపింది. ఉగ్రవాదులతో దోస్తానా చేస్తోంది’’ అని ఆరోపణలు చేశారు. ఆయన వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం తీవ్ర దుమారం రూపుతున్నాయి.