తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) ఆ రాష్ట్ర ప్రజలను వెంటనే పిల్లలను కనాలని విజ్ఞప్తి చేసారు. త్వరలో లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. ఈ నేపథ్యంలో కొత్తగా పెళ్ళైన జంటలు త్వరగా పిల్లలు కనే దానిపై దృష్టి పెట్టాలని కోరారు. జనాభా ఆధారంగా జరిగే ఈ ప్రక్రియలో రాష్ట్రము తీవ్ర నష్టం చవిచూడాల్సి వస్తుందని తెలిపారు. జనాభా తక్కువగా ఉండడం వల్ల పార్లమెంట్ లో ప్రాతినిధ్యం తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేసారు. కుటుంబ నియంత్రణపై తీసుకున్న చర్యలే ఇప్పుడు తమిళనాడు(Tamil Nadu) ప్రయోజనాలపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన వివరించారు. డీలిమిటేషన్(Delimitation) వల్ల తమిళనాడుకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు తాను చెప్పిన పిల్లలు కనే ప్రక్రియపై ఆలోచన చేయాలని సూచించారు.
డీలిమిటేషన్ వల్ల పార్లమెంట్ లో లోక్ సభ సీట్ల సంఖ్య తగ్గి రాష్ట్ర అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడే పరిస్థితులు ఉంటాయని స్టాలిన్(MK Stalin) తెలిపారు. గతంలో సమయం తీసుకొని పిల్లలని కనాలని చెప్పాము… కానీ ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవని అన్నారు. అందుకే ఎలాంటి జాప్యం చేయకుండా వెంటనే పిల్లలని కనాలని కోరుతున్నామని స్టాలిన్ తెలిపారు. మార్చి 5న జరిగే అఖిలపక్ష సమావేశానికి 40 రాజకీయ పార్టీలను ఆహ్వానించామన్నారు. దీనిని తమిళనాడు హక్కులకు సంబందించిన అంశంగానే పరిగణించాలని కోరారు. అదేవిధంగా రాజకీయ కోణంలో చూడొద్దని.. రాష్ట్ర ప్రయోజనాల కోణంలో చూడాలని విజ్ఞప్తి చేసారు.