రష్యాలో జరిగిన ఉగ్రవాదుల దాడి (Russia Terror Attack) పట్ల ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని.. రష్యాకి భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. “మాస్కోలో జరిగిన ఉగ్రదాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధితుల కుటుంబాలకు మా ప్రగాఢ సంతాపం. ఈ విపత్కర సమయంలో రష్యా ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు మేం అండగా నిలబడతాం” అని ట్వీట్ చేశారు.
మరోవైపు ఈ ఉగ్రదాడి ఘటనపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని నెల రోజుల క్రితమే రష్యాను హెచ్చరించినట్లు వైట్‌హౌస్ జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి అడ్రియెన్నీ వాట్సన్ చెప్పారు. మాస్కోలో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని అమెరికా ప్రభుత్వానికి నిఘా వర్గాల నుంచి సమాచారం అందిందని.. ప్రజలు ఎక్కువగా గుడిగూడే ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరగొచ్చని రష్యా అధికారులను హెచ్చరించినట్లు ఆయన వెల్లడించారు. అటు మాస్కోలో జరిగిన దాడులకు తామే బాధ్యులమని ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రకటించింది. ఇటు దాడి ఎవరు చేశారనే దానిని రష్యా ఇంతవరకూ అధికారికంగా ప్రకటించలేదు.
కాగా శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో మాస్కోలోని క్రాకస్ సిటీ కన్సర్ట్ హాల్ (Crocus City Hall) లోకి ఐదుగురు దుండగులు ప్రవేశించారు. ప్రజలపై కాల్పులు, గ్రనేడ్లతో విరుచుకుపడ్డారు. ఈ కాల్పుల్లో సుమారు 60 మంది మృతిచెందారు. మరో 100 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.