దేశంలో విమానాలకు బాంబు బెదిరింపులు(Bomb Threats) వస్తున్న ఘటనలు అధికమవుతున్నాయి. ఇవి దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. విమానాల్లో ప్రయాణించాలంటే ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. వాటిని ఆకతాయి చేష్టలని కొట్టిపారేయడానికి లేదని, ఎవరో పక్క ప్లాన్ ప్రకారమే ఈ బెదిరింపులకు పాల్పడుతున్నారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ బెదిరింపుల వెనకున్న వారిని గుర్తించడం కోసం అన్ని కోణాల్లో చర్చలు చేపడుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి. అధకారిక లెక్కల ప్రకారం 24 గంటల్లో 20కి పైగా విమానాలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇవి లభించిన వెంటనే అన్ని విమానాల్లో తనిఖీ చేశామని, ఎక్కడా ఏమీ లభించకపోవడంతో వెనుతిరిగినట్లు చెప్పారు. ఏ విమానంలో కూడా ఎటువంటి పేలుడు పదార్థాలు కానీ, అనుమానస్పద వస్తువులు కానీ లభించలేదని అధికారులు చెప్పారు. ఈరోజు ఉదయం కూడా ముంబై-ఇస్తాంబుల్, జోధ్‌పూర్-ఢిల్లీ, హైదరాబాద్-చండీగఢ్, ఢిల్లీ-ఇస్తాంబుల్, జెడ్డా-ముంబై మధ్య ప్రయాణించే విమానాలకు బెదిరింపులు వచ్చాయి.
ఇండిగోకు(IndiGo) చెందిన ఐదు, ఆకాశ ఎయిర్‌లైన్స్ సంస్థలకు చెందిన ఐదు, విస్తారాకు చెందిన మూడు విమానాలతో పాటు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, స్పైస్‌జెట్, స్టార్ ఎయిర్, అలయన్స్ విమానాలకు బెదిరింపులు(Bomb Threats) వచ్చాయి. ఈ కాల్స్ రావడంతో పలు విమానాలను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. మరికొన్ని విమానాల టేకాఫ్ ఆపి మరీ తనిఖీలు చేశారు. ఈ ఘటనలపై ఇండిగో స్పందిస్తూ.. తమకు ప్రయాణికుల ప్రాణాలే ముఖ్యమని, దీనిపై సంబంధిత అధికారులతో చర్చిస్తామని, చర్యలు తప్పకుండా ఉంటాయని చెప్పింది.