నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశంలోని అన్ని పాఠ్య పుస్తకాల్లో ఇండియా అనే పదానికి బదులు భారత్ అనే పదాన్ని చేర్చాలనే ప్రతిపాదనకు ప్యానెల్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనను వెంటనే అమలు చేయాలని కోరుతూ సిఫార్సు చేసింది. ఇండియా బదులు భారత్ అనే పదాన్ని చేర్చాలనే ప్రతిపాదనకు కమిటీ ఏకగ్రీవంగా అంగీకారం తెలిపినట్లు ప్యానెల్ ఛైర్మన్ ఐజాక్ వెల్లడించారు. ఇకపై కొత్తగా ముద్రించే NCERT పుస్తకాల్లో భారత్ అనే పదం ఉంటుందని స్పష్టం చేశారు. ఇండియా స్థానంలో భారత్ పేరు పెట్టాలన్న ప్రతిపాదన చాలా కాలంగా పెండింగ్‌లో ఉందని.. తాజాగా దానిని ఆమోదించినట్లు తెలిపారు.
గతంలో హిందూ ధర్మం విజయాలను కూడా NCERT పాఠ్యపుస్తకాల్లో హైలైట్ చేయాలని కమిటీ సిఫార్సు చేసినట్లు ఐజాక్ చెప్పారు. చరిత్రలో ఇప్పటిదాకా హిందువుల ఓటముల గురించే ప్రస్తావనే ఉందని హిందూ రాజులు సాధించిన విజయాలను ఎక్కడా ప్రస్తావించలేదని పేర్కొన్నారు. బ్రిటిష్ వారి మరకల్ని శాశ్వతంగా దూరం చేయడానికే పేర్లు మారుస్తున్నట్లు క్లారిటీ ఇచచార. అన్ని పాఠ్యాంశాల్లో భారతీయ నాలెడ్జ్ సిస్టమ్ ప్రవేశపెట్టాలని కూడా కమిటీ సిఫారుసు చేసిందన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 1(1)లో దేశం పేరును ఇండియా అంటే భారత రాష్ట్రాల యూనియన్ అని ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.
అయితే పాఠ్య పుస్తకాల్లో సైతం పేర్లు మార్చడంపై ఇండియా కూటమి(INDIA Alliance) నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కూటమిని చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారని విమర్శిస్తున్నారు. కాగా జీ20 సమావేశాల సందర్భంగా దేశాధినేతలకు ఇచ్చిన విందు ఆహ్వాన పత్రికలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ స్థానంలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్యాలయం పేర్కొనడం దుమారం రేపింది. ఆ తర్వాత జరిగిన జీ20 సమావేశంలో కూడా ప్రధాని మోదీ ముందు భారత్ అనే నేమ్ ప్లేట్ ఉండటంతో ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.