26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక కుట్రదారుడి కోసం భారత అధికారులు చేస్తున్న ప్రయత్నాలకు ముఖ్య అడుగు పడింది. ఎట్టకేలకు అతను అధికారుల కస్టడీకి చిక్కాడు. శుక్రవారం NIA ప్రత్యేక కోర్టు ఉగ్రదాడుల కీలక కుట్రదారుడు తహవూర్ హుస్సేన్ రాణాను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కి 18 రోజుల కస్టడీ కోసం అప్పగించింది. రాణాను అమెరికా నుంచి రప్పించిన తర్వాత విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెల్లడించింది. అతని కోసం భారతదేశం చేస్తున్న దీర్ఘకాల ప్రయత్నాలలో ఇది ఒక ముఖ్యమైన అడుగు.
తహవూర్ హుస్సేన్ రాణా(Tahawwur Hussain Rana) పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా జాతీయుడు. ప్రస్తుతం చికాగోలో నివసిస్తున్న 64 ఏళ్ల రాణాను లాస్ ఏంజిల్స్ నుండి ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించారు. అతనిని ఇండియాకి తీసుకువచేటప్పుడు విమానంలో NIA, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) అధికారులు ఎస్కార్ట్ గా ఉన్నారు. రాజధానికి చేరుకున్న రాణాను అన్ని చట్టపరమైన లాంఛనాలు పూర్తి చేసిన తర్వాత NIA బృందం అధికారికంగా అరెస్టు చేసింది.
భారత అధికారుల సంవత్సరాల నిరంతర, సమిష్టి ప్రయత్నాల ఫలితంగా రాణా అప్పగింత జరిగిందని NIA ఒక ప్రకటనలో ధృవీకరించింది. భారతదేశం-అమెరికా అప్పగింత ఒప్పందం ప్రకారం అప్పగింత ప్రక్రియ ప్రారంభమైన తర్వాత రాణా అమెరికా న్యాయస్థానాలలో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ఈ ప్రక్రియలో అమెరికా సుప్రీంకోర్టుకు అత్యవసర అప్పీల్‌తో సహా అమెరికన్ కోర్టులలో రాణా తనని ఇండియాకి అప్పగించొద్దని అనేక దరఖాస్తులు పెట్టుకున్నప్పటికీ… అవన్నీ చివరికి తిరస్కరించబడ్డాయి.
166 మంది ప్రాణాలు కోల్పోయి, వందలాది మంది గాయపడిన 2008 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) ప్రణాళిక, అమలులో పాల్గొన్న వారందరినీ జవాబుదారీగా ఉంచాలనే భారతదేశ మిషన్‌లో రాణా అరెస్టు ఒక ముఖ్యమైన పరిణామంగా చెప్పవచ్చు. కుట్రపై మరిన్ని వివరాలను సేకరించడానికి, దాడిలో పాల్గొన్న ఇతర వ్యక్తులతో సంబంధాలను వెలికితీసేందుకు NIA రానాను విచారించనుంది.