కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) సరికొత్త రికార్డ్ సృష్టించారు. వరుసగా ఏడుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా ఆమె నిలిచారు. 2019 మే 30 నుంచి ఆమె భారత దేశ కేంద్ర ఆర్థిక మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అదే ఏడాది మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఆమె తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆతర్వాత వరుసగా 2020-21, 2021-22, 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల ఉన్న నేపథ్యంలో ఫిబ్రవరిలో ఓటాన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి కూడా ఎన్‌డీఏ ప్రభుత్వమే రావడంతో ఈరోజు 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దీంతో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఏడుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మంత్రిగా నిర్మలా సీతారామన్ నిలిచారు. ఇప్పటి వరకు ఈ ఘటన మొరార్జీ దేశాయ్ పేరిట ఉంది. ఆయన 1959-1964 మధ్య ఐదు పూర్తిస్థాయి, ఒక తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆయన రికార్డును ఈ ఏడాది బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) అధిగమించారు.