బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్(Nitish Kumar) బలపరీక్షలో నెగ్గారు. విశ్వాస పరీక్షలో నితీష్ కుమార్‌కు మద్దతుగా 129 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలుండగా.. 122 మంది మద్దతు అవసరం. అయితే నితీష్‌కు మరో ఏడు మంది సపోర్ట్ చేయడంతో ఆయన ఈజీగా నెగ్గారు. దీంతో ఆ రాష్ట్రంలో జేడీయూ-బీజేపీ కూటమి అధికారానికి ఎలాంటి ఢోకా లేకుండా పోయింది.
అయితే నితీష్‌కు అనుకూలంగా ఐదుగురు ఆర్జేడీ(RJD) ఎమ్మెల్యేలు ఓటు వేశారు. ఆర్జేడీ జారీ చేసిన విప్‌ను ధిక్కరించి మరీ ఓటు వేశారు. దీంతో అధికారపక్షం తమ ఎమ్మెల్యేలను బలవంతంగా లొంగదీసుకుందని ఆరోపిస్తూ ఆర్జేడీ, కాంగ్రెస్ సహా విపక్ష నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు. కాగా ఇటీవల మహాఘట్‌బంధన్‌కు నితీష్ కుమార్(Nitish Kumar) గుడ్ బై చెప్పి ఎన్డీయే కూటమిలో చేరిన సంగతి తెలిసిందే. అనంతరం బీజేపీ మద్దతుతో బీహార్ ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆదేశాలతో ఇవాళ బలపరీక్ష నిరూపించుకున్నారు.