Maharashtra CM Race | మహారాష్ట్ర సీఎం పీఠాన్ని ఎవరు అధిష్టించనున్నారన్నది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మహారాష్ట్ర సీఎం అయ్యేది ఫడ్నవీసే అన్న వార్తలు ఒకవైపు వినిపిస్తుండగా.. షండేనే మళ్ళీ సీఎం చేయాలని కోరుకుంటున్న వారు లేకపోలేదు. కాగా సీఎం ఎవరన్నది నిర్ణయించేది బీజేపీనే అని ఆపద్ధర్మ సీఎం షిండే(Eknath Shinde) ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. కానీ ఇప్పటికీ ఈ విషయంపై క్లారిటీ రాలేదు.
దీంతో ప్రస్తుతానికి సీఎం రేసులో ఫడ్నవీస్, షిండే పేర్లు ఉన్నాయి. ఇంతలో ఈ రేసు(Maharashtra CM Race)లోకి మరో పేరు కూడా వచ్చే చేరడం ప్రస్తుతం తీవ్ర చర్చలకు దారి తీస్తోంది. సీఎం అభ్యర్థిగా బీజేపీ.. ఫడ్నవీస్, షిండేలతో పాటు మురళీధర్ మోహోల్(Murlidhar Mohol) పేరును కూడా పరిశీలిస్తోందని చర్చ జరుగుతోంది. ఇప్పుడు కొత్తగా సీఎం రేసులోకి మురళీదర్ పేరు చేరడంతో సీఎం అభ్యర్థిపై ఉన్న ఉత్కంఠ మరింత అధికమైంది.
ఇదిలా ఉంటే సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో జరుగుతున్న జాప్యంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు కాకముందే మహాయుతి అట్టర్ ప్లాప్ అయిందంటూ మహావికాస్ అఘాడి కూటమి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కీలకమైన సీఎం అభ్యర్థి విషయంలోనే క్లారిటీ లేని.. రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారో? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు విపక్ష నేతలు.
దాంతో పాటుగా సీఎం అభ్యర్థి ఎంపికకే ఇంత సమయం తీసుకుంటే ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ప్రజల సమస్యలకు పరిష్కారాలు చూపించాలంటే ఈ ఐదేళ్లు చాలవేమో అంటూ చురకలంటిస్తున్నారు. మరి ఈ విషయంలో మహాయుతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.