లోక్ సభ ఎన్నికలకు ఇండియా కూటమి(India Alliance) రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ నేథ్యంలోనే సోమవారం ఢిల్లీలో కీలక భేటీ జరిగింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal), పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ(Mamata Banerjee) లు సమావేశం అయ్యారు. ఈమధ్య జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం ఏర్పాటైన ఈ సమావేశానికి రాజకీయ ప్రాముఖ్యత సంతరించుకుంది. అయితే, ఈ నేతలు ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరిగాయి అనే విషయం పై క్లారిటీ లేదు.
కాగా, నేడు ఢిల్లీలో ఇండియా కూటమి(India Alliance) సమావేశం కానుంది. ఈ సమావేశానికి ముందే కేజ్రీవాల్, మమత భేటీ కావడం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పశ్చిమ బెంగాల్ సీఎం నాలుగు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ రాజధానిలో ఇండియా కూటమి సమావేశం కానుంది. తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, మిజోరం, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ప్రతిపక్ష కూటమి మొదటిసారి భేటీ అవనుంది. రేపు ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీని టీఎంసీ చీఫ్, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కలవనున్నారు. కేంద్రం నుంచి తమ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై ఆమె చర్చించనున్నారు. ఇండియా కూటమి భేటీని మొదట ఈనెల 6న నిర్ణయించారు. కానీ బీహార్ సీఎం నితీష్ కుమార్ సహా కీలక నేతలు డుమ్మా కొట్టడంతో డిసెంబర్ 17కి వాయిదా పడింది. ఇది కూడా పలు కారణాలతో వాయిదా పడడంతో ఈరోజు భేటీ కానున్నారు. ఈ భేటీ అయిన సవ్యంగా సాగుతుందా? కూటమి నేతలు అందరూ హాజరవుతారా? పార్లమెంటు ఎలక్షన్ లపై ఎలాంటి నిర్ణయానికి వస్తారు అనే అంశాలపై క్లారిటీ లేదు.