OTT Platforms | ఇండియాస్ గాట్ టాలెంట్ కార్యక్రమంలో యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియా(Ranveer Allahbadia) చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. మహారాష్ట్రలోని అధికార, ప్రతిపక్షాలన్నీ ఈ విషయంలో ఏకతాటిపైకి వచ్చాయి. సదరు యూట్యూబర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ఓటీటీ ఫ్లాట్‌ఫార్మ్‌లకు కేంద్ర ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఐటీ రూల్స్‌లోని కోడ్ ఆఫ్ ఎథిక్స్‌ను ప్రతి ఓటీటీ సంస్థ పాటించాలని, చిన్నారులకు ‘ఏ’ రేటెడ్ కంటెంట్ అందుబాటులో లేకుండా చూడాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.
‘‘సోషల్ మీడియా, ఓటీటీ ఫ్లాట్‌ఫార్మ్‌లలో అశ్లీల కంటెంట్ ఉన్నట్లు ఫిర్యాదులు అందాయి. కోడ్ ఆఫ్ ఎథిక్స్‌ను ప్రతి ఓటీటీ ఫ్లాట్‌ఫార్మ్(OTT Platforms), సోషల్ మీడియా(Social Media) సంస్థ తూచా తప్పకుండా పాటించాలి. వీటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. వారు ప్రసారం చేసే ప్రతి కంటెంట్ కూడా ఈ రూల్స్‌కు లోబడే ఉండాలి. వయసు ఆధారిత కంటెంట్ అందుబాటులో ఉండాలి. స్వీయ నియంత్రణ కలిగిన ఓటీటీలు నైతిక విలువలను పాటించాలి’’ అని కేంద్రం స్పష్టం చేసింది.