అదానీ(Adani) లంచాల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలన సృష్టిస్తోంది. దీని ప్రభావం పార్లమెంటు(Parliament) ఉభయ సభలపై కూడా పడుతోంది. వరుసగా మూడు రోజుల నుంచి పార్లమెంటు సమావేశాలను అదానీ అవినీతి అంశం కుదిపేస్తోంది. అదానీ అంశంపై సమగ్ర చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ విపక్ష నేతలు వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టగా వాటిని ఉభయ సభాధిపతులు తిరస్కరించారు.
దీంతో ఉభయ సభల్లో విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. అదానీ అంశాన్ని చర్చించకుండా దాటేయడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. దీనిని ఒక వ్యక్తికి సంబంధించిన అంశంగా కాకుండా రూ.వేల కోట్ల అవినీతి వ్యవహారంగా పరిగణించి చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో గురువారం చర్చల్లో కూడా తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఉభయ సభలు రేపటికి వాయిదా పడినట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.
అంతేకాకుండా కాంగ్రెస్ సహా విపక్షాలు పార్లమెంటు సమావేశాలను అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘‘బీఏసీ సమావేశంలో(BAC Meeting) బిల్లులపై చర్చకు సమయాన్ని కేటాయించడం జరిగింది. అందుకు విపక్ష ఎంపీలు అంగీకారం తెలిపారు. కాంగ్రెస్ సహా విపక్షాలు నిబంధనలకు విరుద్ధంగా పార్లమెంట్లో వహరిస్తున్నాయి.
ఎంపీల నియోజకవర్గ అంశాలను పార్లమెంట్లో(Parliament) లేవనెత్తకుండా సభా కార్యకలాపాలను కాంగ్రెస్ విపక్షాలు అడ్డుకుంటున్నాయి. వక్ఫ్ జెపీసీని పొడిగించాం. వక్ఫ్ జెపీసీ పూర్తి డేటా కావాలని విపక్షాలు అడిగాయి. వాటిని ఇచ్చేందుకు అంగీకారం తెలిపాము. అయినా విపక్షాలు సభ కార్యకలాపాలను అడ్డుకోవడం సరికాదు’’ అని ఆయన అన్నారు.