పార్లమెంట్(Parliament) వర్షాకాల సమావేశాలు ముగిశాయి. ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేశారు. సమావేశాలు ప్రారంభం అయిన రోజు నుంచి ఉభయ సభల్లో మణిపూర్ అంశంపై రచ్చ జరిగింది. ప్రధాని మోదీ మణిపూర్ హింసపై మాట్లాడాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో పలుమార్లు సభలు వాయిదా పడుతూ వచ్చాయి. ఈ క్రమంలో ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాయి. ఈ తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదించగా మూడు రోజుల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మోదీతో పాటు కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. చివరగా అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ మాట్లాడుతూ రాహుల్ గాంధీతో పాటు విపక్షాలపై సెటైర్లు వేశారు. దాదాపు 20 గంటలు అవిశ్వాస తీర్మానంపై చర్చ నడిచింది.
లోక్‌సభ మొత్తం 39 గంటల 15 నిమిషాలు పనిచేసింది. రాజ్యసభ మొత్తం 44గంటల 58 నిమిషాల పాటు పని చేసింది. డిజిటల్ డేటా ప్రొటక్షన్, ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుతో కలిపి మొత్తం 22 బిల్లును సభలో ప్రవేశ పెట్టారు. ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందేలపై 28 శాతం పన్ను విధించే బిల్లులకు పార్లమెంట్(Parliament ) ఆమోదం తెలిపింది. ఎలాంటి చర్చ లేకుండా మూజువాణి ఓటుతో కేంద్ర వస్తు సేవల పన్ను సవరణ బిల్లు-2023, ఇంటిగ్రేటెడ్ వస్తు సేవల పన్ను సవరణ బిల్లు 2023కు ఆమోదం తెలిపాయి. విపక్షాల ఆందోళనల నడుమే అధికార పక్షం కొన్ని బిల్లులకు ఏకపక్షంగా ఆమోదముద్ర వేయించుకుంది.
ఆఖరి రోజైన శుక్రవారం లోక్‌సభ(Lok Sabha)లో కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి సస్పెన్షన్‌పై రభస జరిగింది. అధిర్‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలని కాంగ్రెస్ సహా విపక్ష పార్టీల సభ్యులంతా డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభను నిరవధిక వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఆప్ ఎంపీలు సంజయ్ సింగ్, రాఘవ్ చద్దాలపై సస్పెన్షన్‌లను ఎత్తివేయాలని డిమాండ్‌లు వెల్లువెత్తాయి. విపక్షాల నిరసనల మధ్యే చైర్మన్ జగదీప్ ధన్‌కర్ రాజ్యసభ(Rajya Sabha)ను నిరవధిక వాయిదా వేస్తూ ప్రకటించారు.