మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. అప్పటి నుంచి మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నది హాట్ టాపిక్‌గా మారింది. మళ్ళీ ఏక్‌నాథ్ షిండేనే(Eknath Shinde) మహారాష్ట్ర సీఎం అవుతారని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం లేదు.. ఫడ్నవీసే(Devendra Fadnavis) ఈసారి సీఎం అంటూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర సీఎం ఎవరన్న అంశంలో నెలకొన్న సందిగ్దతపై ఆపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్ షిండే స్పందించారు. ప్రభుత్వ ఏర్పాటు, సీఎం అభ్యర్థి ఎంపికలో తుది నిర్ణయం ఎవరు తీసుకోనున్నారో చెప్పేశారు. తన దృష్టిలో సీఎం అంటే కామన్ మ్యాన్ అని, ఆ పదవిలో ఉన్న వ్యక్తికి ప్రజాసేవే ధ్యేయంగా ఉండాలన్నదే తన ఆలోచన అని షిండే చెప్పుకొచ్చారు.
‘‘మహాయుతి కూటమికి(Mahayuti Alliance) ఇంతటి చారిత్రాత్మక విజయం అందించిన ఓటర్లకు మరోసారి ధన్యవాదాలు. ఎన్నికల సమయంలో రాత్రింబవళ్లు పనిచేశా. నిద్రకు రెండుమూడు గంటలు మాత్రమే కేటాయించాను. ఒక కార్యకర్తలా పనిచేశా. నా దృష్టిలో సీఎం అంటే కామన్ మ్యాన్. నేను సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాను. నాకు ప్రజలు పడే ప్రతి కష్టం గురించి తెలుసు. మహిళలు, రైతులు, యువత ఇలా అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పథకాలు తీసుకొచ్చాం. సీఎంగా నాకు ఎటువంటి అసంతృప్తి లేదు. నేను సీఎంగా ఉన్న సమయంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు అనేక విషయాల్లో అండగా నిలిచారు. ఇప్పుడు కూడా సీఎం ఎవరన్న విషయంలో వారిదే తుది నిర్ణయం. వారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి ఉంటాను’’ అని చెప్పారు షిండే(Eknath Shinde).