ప్రధాని మోదీ(PM Modi) శనివారం శ్రీలంకలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఇరు దేశాలు పలు కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా తన ప్రభావాన్ని విస్తరిస్తుందనే ఆందోళనల మధ్య రక్షణ, ఇంధనం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, వాణిజ్య రంగాలలో రెండు దేశాల ప్రధానులు ఏడు అవగాహన ఒప్పందాలపై (MoU) సంతకం చేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో, రెండు దేశాల ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చేసిన అసాధారణ కృషికి గాను ప్రధాని మోదీని శ్రీలంక అత్యున్నత పౌర పురస్కారం మిత్ర విభూషణతో సత్కరించారు.
శ్రీలంక(Sri Lanka) అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే(Anura Kumara Dissanayake) గత సంవత్సరం బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీ(PM Modi) చేసిన తొలి పర్యటన ఇది. అంతేకాదు 2024లో దిస్సనాయకే పదవీకాలం ప్రారంభమైన తర్వాత ఆ దేశానికి విదేశీ నాయకుడు చేసిన తొలి పర్యటన కూడా ఇదే. అలాగే, 285 ఎకరాల ద్వీపం చుట్టూ చేపల వేట హక్కులపై చాలా కాలంగా ఉన్న వివాదం కారణంగా తమిళనాడు రాష్ట్రంలోని మత్స్యకారులకు భావోద్వేగ సమస్య అయిన కచ్చతీవును శ్రీలంక నుండి తిరిగి పొందాలని ఆ రాష్ట్రం తీర్మానం ఆమోదించిన సమయంలోనే ప్రధాని మోదీ పర్యటన జరగడం గమనార్హం.