మహా వికాస్ అగాడీ(MVA) కూటమి నేతలపై ప్రధాని మోదీ(PM Modi) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం అ‘గాడీ’ కూటమిలో నేతలంతా కూడా డ్రైవర్ సీటు కోసం కొట్లాడుకుంటున్నారని విసుర్లు విసిరారు. ఎన్నికలు సమీపిస్తుండటంతోనే సీఎం సీటు కోసం కూటమి పార్టీల నేతలంతా పోటీ పడుతున్నారని, దీంతో మహా వికాస్ అగాడీలో అంతర్గత పోరు మొదలైందని విమర్శించారు. ప్రతిపక్ష కూటమిలో సీఎం ఎవరవుతారనేది ఇప్పటికీ తేలలేదని ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ధూలేలో నిర్వహించిన సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీల నేతలను ఉద్దేశించి కీలక విమర్శలు చేశారు. అధికారంలో మహాయుతి కొనసాగితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, కానీ కొందరు మాత్రం అందుకు వ్యతిరేకంగా ప్రజలను లూటీ చేయడమే పరమావధిగా రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వాళ్లంతా కలిసి రాష్ట్ర అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తారని దుయ్యబట్టారు.
‘‘మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి(Mahayuti Alliance) సర్కారే సుపరిపాలనను అందించగలదు. మహారాష్ట్ర ప్రజలను ఏది అడిగినా హృదయపూర్వకంగా ఇచ్చేస్తారు. అలాంటి వారిలో విష బీజాలు నాటి దేశాన్ని, దేశంలోని గిరిజన వర్గాలను విభజించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కానీ ప్రజలంతా ఐకమత్యంతో ఉంటే వారిని ఎవరూ విడదీయలేరు. వారి కుట్రలకు జమ్మూకశ్మీర్ నిలువెత్తు నిదర్శనం. వారు అధికారంలోకి రాగానే అక్కడ కుట్రలు ప్రారంభించేశారు. ఆర్టికల్ 370ని పునరుద్ధరించడం కోసం అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. కానీ అది ఎప్పటికీ జరగని పని’’ అని మోదీ(PM Modi) పునరుద్ఘాటించారు.