ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) ప్రతిపక్షాల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా కూటమి(Opposition Front INDIA)పై నిప్పులు చెరిగారు. కూటమి పేరులో ఇండియా ఉంటే సరిపోదన్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ పేరులో, ఇండియన్ ముజాహిద్దీన్, పీఎఫ్ఐ పేర్లలో కూడా ఇండియా ఉందని గుర్తు చేశారు. మంగళవారం బీజేపీ ఎంపీలతో సమావేశం అయిన ప్రధాని పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు విపక్షాలు అంతరాయం కలిగిస్తున్నాయని ధ్వజమెత్తారు.
ఇటువంటి దిక్కులేని ప్రతిపక్షాన్ని ఎన్నడూ చూడలేదని ఘాటు విమర్శలు గుప్పించారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి దేశం పేరను ఉపయోగించడం సరిపోదని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు నిరాశ, నిస్పృహలోనే కొనసాగాలని నిర్ణయించుకుంటున్నాయని ఆ పార్టీల ప్రవర్తనను చూస్తే అర్థం అవుతోందన్నారు. 2024 ఎన్నికల్లోనూ ప్రజల మద్దతు బీజేపీకే ఉందని తమ ప్రభుత్వ హయాంలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రధాని మోడీ(PM Modi) విశ్వాసం వ్యక్తం చేశారు.