కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ప్రధాని మోదీ(PM Modi) ఫోన్ చేశారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ ఆరా తీశారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు కూడా. ఇటీవల ఓ సభలో పాల్గొన్న ఖర్గే.. ప్రసంగిస్తూనే అస్వస్థతకు గురయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కఠువా జిల్లాలో నిర్వహించిన సభలో ఖర్గే పాల్గొన్నారు. ఆ సభలో ప్రసంగిస్తూ ఆయన సొమ్మసిల్లిపోయారు. వెంటనే స్పందించిన సిబ్బంది, నేతలు.. ఆయనకు నీళ్లు తాపించి సేదతీర్చారు. కొద్దిసేపటికే కోలుకున్న ఖర్గే.. తిరిగి తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ ప్రసంగంలో ఖర్గే(Mallikarjun Kharge) ప్రధాని మోదీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను ఎనభైల్లో ఉన్నా. ఇప్పుడప్పుడు మరణించను. ప్రధాని మోదీని అధికారం నుంచి దించే వరకు బతికే ఉంటా’’ అని ఖర్గే ఆ సభలో వ్యాఖ్యానించారు.
ఖర్గే అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న మోదీ(PM Modi) ఆయనకు ఫోన్ చేసి ఆరా తీశారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అదే విధంగా ఆరోగ్యంపై దృష్టి సారించాలని, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించినట్లు కూడా ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. అయితే ఖర్గేకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తేల్చారు.