భారత్, పాకిస్థాన్ మధ్య సత్సంబంధాలు ఏర్పడవా, శాంతి నెలకొనదా, ఈ దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడవా అంటే కష్టమేనంటున్నారు ప్రధాని మోదీ. భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడటం అనేది ఇస్లామాబాద్‌పైనే ఆధారపడి ఉందని ప్రధాని మోదీ(PM Modi) చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న మోదీ.. పాక్, చైనాలతో భారత్ సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌తో సంబంధాలను మెరుగు పరచడానికి ప్రయత్నించిన ప్రతిసారీ భారత్‌కు నమ్మకద్రోహమే ఎదురైందని ఆయన అన్నారు.
‘‘భారత్, పాక్ దేశాలు తమ మధ్య ద్వైపాక్షిక సంబంధాల విషయంలో కొత్త అధ్యయాన్ని ప్రారంభించాలన్న ఉద్దేశంలో 2014లోనే భారత్ ముందడుగు వేసింది. ఆ సమయంలో నా ప్రమాణస్వీకారానికి పాకిస్థాన్ ప్రధానిని నవాజ్ షరీఫ్‌ను(Nawaz Sharif) ఆహ్వానించాను. శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నించిన ప్రతిసారీ శత్రుత్వం, మోసమే ఎదురైంది. ఇప్పటికీ నిర్ణయం వారి చేతుల్లోనే ఉంది. శాంతి మార్గాన్ని ఎంచుకుంటారని ఆశిస్తున్నా’’ అని మోదీ(PM Modi) అన్నారు. పాకిస్థాన్ ప్రజలు ఎంతో కాలంగా శాంతికోసం ఎదురుచూపులు చూస్తున్నారని, వారు కలహాలు, అశాంతితో అలసిపోయి ఉన్నారని వ్యాఖ్యానించారు. ఉగ్రదాడుల్లో ఎంతోమంది అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని, ఎంతోమంది జీవితాలు నాశనమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.