కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ(PM Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన తన సంతాపాన్ని తెలిపారు. మన్మోహన్ సింగ్ తో ఆయనకి ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మన్మోహన్ గొప్ప నాయకుడని కొనియాడారు. ఆయన మృతిపై కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు. “భారతదేశం తన అత్యంత విశిష్ట నాయకులలో ఒకరైన డాక్టర్ మన్మోహన్ సింగ్ ని కోల్పోవడంతో మూగబోయింది.
సామాన్యుని స్థాయి నుంచి ఆయన గౌరవనీయమైన ఆర్థికవేత్తగా ఎదిగారు. ఆయన ఆర్థిక మంత్రిగా సహా వివిధ ప్రభుత్వ పదవులలో పనిచేశారు. మన ఆర్థిక విధానంపై బలమైన ముద్ర వేశారు. పార్లమెంట్‌లో ఆయన తెలివైన అడుగులు వేశారు. మన ప్రధానిగా ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఆయన విస్తృతంగా కృషి చేశారు” అని మోదీ మన్మోహన్ సింగ్ ని ప్రశంసించారు.
అలాగే మన్మోహన్ సింగ్(Manmohan Singh) తో ఆయనకి ఉన్న అనుభవాల్ని మోదీ(PM Modi) ఎక్స్ వేదికగా పంచుకున్నారు. కొన్ని ఫోటోలను కూడా షేర్ చేశారు. “డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా, నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేకసార్లు కలుసుకున్నాము. పాలనకు సంబంధించిన వివిధ విషయాలపై మేము విస్తృతమైన చర్చలు జరిపేవాళ్ళం. ఆయన జ్ఞానం, వినయం ఎల్లప్పుడూ కనిపించేవి. ఈ దుఃఖ సమయంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ కుటుంబం, ఆయన స్నేహితులు, అసంఖ్యాక అభిమానులకు నా సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
కాగా 92 ఏళ్ల మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గురువారం సాయంత్రం ఆయన శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆయనని హుటాహుటిన ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మరణించారు. ఆయన గురువారం రాత్రి 9:51 గంటలకు మరణించినట్లు ధృవీకరిస్తూ ఎయిమ్స్ వైద్యులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. మన్మోహన్ సింగ్ మృతితో ఆయన కుటుంబంలో, కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖులు ఆయన మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.