అనకాపల్లి అచ్యుతాపురంలోని ఫార్మా సంస్థ ఎసెన్షియాలో బుధవారం మధ్యాహ్న సమయంలో భారీ ప్రమాదం జరిగింది. సాల్వెంట్ ఆయిల్‌ను ఒక అంతస్తు నుంచి మరొక అంతస్తుకు పంప్ చేసే క్రమంలో లీకై మంటలు చెలరేగాయని అనంతరం పెద్ద పేలుడుతో ప్రమాదం సంభవించి కార్మికుల మరణాలకు దారితీసిందని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు తయారు చేసిన ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తాజాగా దీనిపై ప్రధాని మోదీ(PM Modi) స్పందించారు. ఈ ఘటన తనను ఎంతో బాధకు గురి చేసిందని పేర్కొన్నారు.
‘‘అచ్యుతాపురం సెజ్‌లో సంభవించిన పేలుడు ఘటన ఎంతో బాధించింది. అందులో పలువురు ప్రాణాలు కోల్పోవడం కలవరానికి గురిచేస్తోంది. మృతుల సన్నిహితులు, స్నేహితులు, కుటుంబీకులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. అదే విధంగా ఈ ప్రమాదంలో మరణించిన వారికి కేంద్ర ప్రభుత్వం తరపున రూ.2 లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం అందిస్తాం’’ అని PM Modi వెల్లడించారు.