PM Modi fires on Congress: కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదాన్ని తారాస్థాయికి తీసుకువెళ్లిందనీ.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే ఉగ్రవాదులు దేశాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు చేశారంటూ ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ, కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. గుజరాత్‌లోని ఖేడా ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ పాల్గొని, ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదాన్ని లక్ష్యంగా చేసుకొని పోరాడాలని కాంగ్రెస్‌ను కోరితే.. తనను లక్ష్యంగా చేసుకున్నారని ఎద్దేవా చేశారు. సూరత్, అహ్మదాబాద్‌లలో జరిగిన ఉగ్రవాద పేలుళ్లలో ఎంతోమంది గుజరాత్ ప్రజలు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పేలుళ్ల సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని గుర్తు చేశారు. దేశంలో ఆ సమయంలోనే ఉగ్రవాదం తారాస్థాయికి చేరుకుందని ఆరోపించారు. ఉగ్రవాదాన్ని కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా చూస్తోందన్నారు.
బీజేపీ ప్రభుత్వం ఉగ్రవాదన్ని నిర్మూలించే దిశగా పనిచేస్తోందన్నారు. 2014లో మీ ఒక్కొక్కరి ఓటు ఉగ్రవాదాన్ని అంతం చేయటానికి సహకరించిందన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ సర్జికల్ స్ట్రైక్స్‌ని ప్రశ్నిస్తుందని మండిపడ్డారు. బీజీపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం మాత్రమే, అభివృద్ధి చేస్తోందన్నారు. యువతకు కర్ఫ్యూ ఎలా ఉంటుందో ఎప్పుడూ చూడనివ్వలేని ప్రభుత్వం తమదేననీ.. వారిని బాంబు పేలుళ్ల నుంచి రక్షించామని అన్నారు. కేవలం ఇది బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వల్లే సాధ్యం అయ్యిందని మోదీ (PM Modi)అన్నారు.