తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ(PM Modi) శుభవార్త అందించారు. ఈ నెల 29న తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహిస్తామని ప్రకటించారు. 104వ మన్‌కీబాత్‌లో మాట్లాడిన మోదీ.. మాతృభాషతో అనుసంధానమైతే మన సంస్కృతి, విలువలు, సాంప్రదాయాలతో బంధం ఏర్పడుతుందన్నారు. దేశంలోని వారసత్వ భాషల్లో తెలుగు ఒకటని.. తెలుగు సాహిత్యం, వారసత్వ సంపదలో భారతీయ సంస్కృతికి సంబంధించిన వెలకట్టలేని అద్భుతాలు ఉన్నాయని తెలిపారు. తెలుగు వారసత్వాన్ని యావత్ దేశానికి అందించే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు చంద్రయాన్-3 విజయంపైనా కీలక వ్యాఖ్యలు చేశారు మోదీ.
చంద్రయాన్-3(Chandrayaan 3) ప్రాజెక్టు మహిళా సాధికారతకు చిహ్నంగా నిలిచిందని కొనియాడారు. ఈ విజయంలో మహిళామూర్తుల పాత్ర ఉందన్న ఆయన.. ఇస్రో సాధించిన విజయంతో ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందన్నారు. ప్రపంచ దేశాలు అంతరిక్ష ప్రయోగాలు భారత్ వేదికగా చేయడానికి మొగ్గు చూపుతున్నాయని వివరించారు. ఇప్పటికే ఇస్రో పంపిన చంద్రయాన్-1తో చంద్రుడిపై నీళ్లు ఉన్నాయని గుర్తించామని.. తాజాగా చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ నిలవడం గర్వకారణమని మోదీ వెల్లడించారు. అలాగే జీ20 దేశాలకు భారత్ నాయకత్వం వహిస్తుండటం గర్వంగా ఉందన్నారు.
ఈ ఏడాది ఢిల్లీ వేదికగా సెప్టెంబర్ నెలలో జరిగే జీ-20 సమావేశాలకు భారత్ సిద్ధమవుతోందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 40 దేశాలకు చెందిన ప్రతినిధులు జీ20 సమావేశాలకు హాజరుకానున్నారని తెలిపారు. జీ20లోకి మరిన్ని దేశాలు రావాలని ఆయన ఆకాంక్షించారు. జి-20 సదస్సును విజయవంతం చేసి దేశ ప్రతిష్టను పెంచుదామని ప్రజలకు మోదీ(PM Modi) పిలుపునిచ్చారు.