కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల విశ్వసనీయతను కోల్పోయిందని.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి కనీసం 40 సీట్లైనా రావాలని కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ(PM Modi) ఎద్దేవా చేశారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీజేపీకి 400 సీట్ల మెజార్టీ వస్తుందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అంచనా వేశారని.. అది తమకు ఆశీర్వాదంగా భావిస్తున్నట్లు తెలిపారు.
దేశాన్ని మరోసారి విభజించడానికి కాంగ్రెస్ పార్టీ(Congress Party) ప్రయత్నిస్తోందని.. ఉత్తరం, దక్షిణం అంటూ విడదీసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. బొగ్గు తమ రాష్ట్రంలో ఉంది.. తామే వాడుకుంటామంటే ఎలా? నదులు తమ రాష్ట్రంలో ఉన్నాయి తామే వాడుకుంటామంటే కుదురుతుందా? మా రాష్ట్రం మా పన్నులు అంటూ మాట్లాడుతున్నారని… అసలు ఇదేం వితండవాదం? అని ప్రశ్నించారు. దేశాన్ని విభజించే కుట్రలను సహించేది లేదని హెచ్చరించారు. భారత్ అంటే ఢిల్లీ ఒక్కటే కాదని బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ కూడా అని వివరించారు.
కాంగ్రెస్ పార్టీని ఓ ఆంగ్లేయుడు స్థాపించారని.. ఇప్పటికీ ఆ పార్టీపై బ్రిటిషర్ల ప్రభావం ఉందని వ్యాఖ్యానించారు. బ్రిటీష్ ప్రభుత్వం ఎలా నడిస్తే అలా భారత పార్లమెంట్‌ను నడిపారని మండిపడ్డారు. ఆ బానిసత్వ గుర్తులను తాము చెరిపేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ విదేశీ వస్తువులను ప్రోత్సహిస్తే తాము మాత్రం మేకిన్ ఇండియాను ప్రోత్సహిస్తున్నామని మోదీ(PM Modi) చెప్పుకొచ్చారు.