Lok Sabha | ఎన్డీఏ సర్కార్‌పై విపక్షాలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మాణం(No Confidence Motion)పై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ.. సభలో విపక్షాల చర్చ ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. ‘ఇండియా’ ఎంపీ చర్చ దేశ ప్రజలను నిరాశ పరిచిందని విమర్శించారు. విపక్షాలకు ఆ భగవంతుడే అవిశ్వాసం పెట్టాలని సూచించి ఉంటాడని ఎద్దేవా చేశారు. ఈ తీర్మానం తమకు ఎప్పటికీ అదృష్టమే అన్నారు. తమను మరోసారి అఖండ మెజార్టీతో గెలిపించేలా విపక్షాలు నిర్ణయం తీసుకున్నాయని సెటైర్లు వేశారు.
Lok Sabha | తమ ప్రభుత్వంపై గతంలోనూ అవిశ్వాస తీర్మానం పెట్టారని గుర్తు చేశారు. ఐదేళ్లు అయినా మీరు సరిగా సిద్ధం కాలేదని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే విపక్షాలు వరుస నో బాల్స్ వేస్తుంటే.. అధికార పక్షం వరుస సిక్సులు కొడుతోందని ఎద్దేవా చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తమ గెలుపును ఆపలేరని అన్నారు. దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే కింది స్థాయి నుంచి సమూల ప్రక్షాళన జరుగాలని సూచించారు.