అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump), భారత ప్రధాని మోదీ(PM Modi) ఒకరిపై ఒకరికి ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ఇటీవల అమెరికాకు చెందిన ప్రముఖ పాడ్‌కాస్టర్, ఏఐ రీసెర్చర్ లెక్స్ ఫ్రిడ్‌మాన్(Lex Fridman) తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆదివారం విడుదలైన ఈ ఇంటర్వ్యూ సుమారు మూడు గంటల నిడివితో ఉంది. ఈ ఇంటర్వ్యూ వీడియో లింకును సోమవారం ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ లో షేర్ చేశారు. ఆ వీడియోలో మోదీ మాట్లాడుతూ… తాను, ట్రంప్ ఇద్దరూ తమ తమ దేశాలకు మొదటి స్థానం ఇచ్చినందున బాగా కనెక్ట్ అయ్యామని, జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా… వారి పరస్పర విశ్వాసం చెక్కుచెదరకుండా ఉందని నొక్కి చెప్పారు.
ట్రంప్ లో మీకు ఏమి నచ్చుతుంది అనే ప్రశ్నకి మోదీ సమాధానమిస్తూ… తన మొదటి పదవీకాలంలో భద్రతా ప్రోటోకాల్ ను పక్కనబెట్టి హూస్టన్ లో ‘హౌడీ మోడీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న స్టేడియం చుట్టూ తిరగమని తాను చేసిన అభ్యర్థనకు ట్రంప్ అంగీకరించారని గుర్తు చేసుకున్నారు. ఆయన ధైర్యం, నాపై ఆయనకున్న నమ్మకం నన్ను కదిలించింది చెప్పుకొచ్చారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో తనపై జరిగిన హత్యాయత్నం తర్వాత ట్రంప్ కూడా ఇలాంటి ధైర్యాన్నే ప్రదర్శించారని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ “అమెరికా ఫస్ట్”ను నమ్ముతారని, తన నినాదం కూడా “భారతదేశం ఫస్ట్” అని మోదీ(PM Modi) అన్నారు. ఈ సారూప్య స్ఫూర్తి వారిని బాగా కనెక్ట్ చేస్తుందని మోదీ వెల్లడించారు.
ఇంటర్వ్యూ లో మోదీ రెండు దేశాలకు సంబంధించిన వాణిజ్య సమస్యలను ప్రస్తావించకుండా… అమెరికా అధ్యక్షుడు, ఆయన సహచరులతో ఇటీవల జరిగిన సమావేశం గురించి మాట్లాడారు. ట్రంప్ అమెరికా అభివృద్ధి విషయంలో స్పష్టమైన రోడ్ మ్యాప్ తో సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నారని, తన రెండవ పదవీకాలంలో బలమైన టీమ్ ని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ వారసత్వాన్ని కొనసాగించాలన్న ఆయన.. తాను కూడా ప్రపంచ శాంతిని కోరుకునే వ్యక్తినని తెలిపారు. రష్యా, ఉక్రెయిన్ నాయకులను చర్చలకు రమ్మని ప్రోత్సహించినట్లు తెలిపారు. ఈ పాడ్‌కాస్ట్ లో మోదీ అనేక విదేశీ వ్యవహారాల సమస్యలతో పాటు తన జీవిత ప్రయాణంలోని వివిధ అంశాలను కూడా ప్రస్తావించారు.
కాగా సోవియట్ యూనియన్ పతనం తర్వాత రష్యా నుండి అమెరికాకు వెళ్లిన ఫ్రిడ్‌మాన్, 2018లో తన పాడ్‌కాస్ట్ ను ప్రారంభించారు. దీనికి మొదట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాడ్‌కాస్ట్ అని పేరు పెట్టారు. కానీ 2020లో లెక్స్ ఫ్రిడ్‌మాన్ పాడ్‌కాస్ట్‌గా పేరు మార్చారు. అతని పాడ్‌కాస్ట్‌లోని అతిథులలో డోనాల్డ్ ట్రంప్, జెలెన్స్కీ, స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్, అమెరికన్ వ్యాపారవేత్త జెఫ్ బెజోస్, మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్ ఉన్నారు.
Read Also: ఉస్మానియా యూనిర్సిటీలో టెన్షన్ టెన్షన్
Follow Us : Google News, Twitter, Share Chat