రైతులకు వ్యవసాయంలో ఆసరాగా నిలిచే యంత్రాల్లో ట్రాక్టర్ ప్రధానమైనది. దుక్కి దున్నడం దగ్గర్నుంచి ఎన్నో అవసరాలకు ట్రాక్టరే ఎక్కువగా అవసరమవుతుంది. కానీ దీనిని కొనుగోలు చేయడం మాత్రం అన్నదాతలకు భారంగా ఉంటుంది. ఇలాంటి రైతుల కోసమే కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. ప్రధానమంత్రి ట్రాక్టర్ యోజన పథకం(PM Tractor Yojana) కింద రైతులు సగం ధరకే ట్రాక్టర్ ను కొనుగోలు చేయవచ్చు. మిగతా సగం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ట్రాక్టర్ కొనుగోలు కోసం రైతులు బ్యాంకుల నుంచి కూడా రుణం తీసుకోవచ్చు.
- Advertisement -
ఉదాహరణకు.. ట్రాక్టర్ ధర రూ. 8 లక్షలు అనుకుంటే.. అందులో కేంద్రం రూ. 4 లక్షలు భరిస్తుంది. మరో రూ. 4 లక్షలు బ్యాంకులు రైతుకు రుణంగా ఇస్తాయి. దీన్ని వాయిదా పద్ధతిలో కట్టొచ్చు. ఈ పథకానికి ఆయా రాష్ట్రాలు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తాయి. భారతదేశంలోని ప్రతి చిన్న, సన్నకారు రైతు ఈ పథకానికి అర్హులు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే రైతు వయస్సు 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి. సొంత పొలం లేని కౌలు రైతులు.. యజమాని నుంచి ఎన్‌ఓసీ తీసుకుని ట్రాక్టర్ కొనుగోలు చేయవచ్చు.
ప్రధానమంత్రి ట్రాక్టర్ యోజన(PM Tractor Yojana) పథకానికి దరఖాస్తు చేసుకునే రైతు వార్షికాదాయం లక్షా 50 వేలకు మించకూడదు. గడిచిన 7 సంవత్సరాలుగా ట్రాక్టర్ కొనుగోలు చేయని వారికి ఈ పథకం కింద మళ్లీ దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఇక ఈ స్కీం కింద ఒక రైతు ఒక ట్రాక్టర్ మాత్రమే కొనుగోలు చేసే వీలు ఉంటుంది. రైతు తనకు నచ్చిన ట్రాక్టర్‌ను నచ్చిన ధరకు, నచ్చిన కంపెనీ నుంచి కొనుగోలు చేయవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు మరో అడుగు ముందుకేసి వినూత్నంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం..యంత్రలక్ష్మి(Yantra Lakshmi) పేరుతో అమలు చేస్తూ.. ట్రాక్టర్ సహా వ్యవసాయ పరికరాలను కూడా అందజేస్తోంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ యంత్రసేవ(Yantra Seva) పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తోంది.
ఏ పత్రాలు కావాలి?
పీఎం ట్రాక్టర్ పథకానికి దరఖాస్తు చేసే రైతులు కచ్చితంగా ఈ పత్రాలు సమర్పించాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు/ఓటర్ ఐడీ / డ్రైవింగ్ లైసెన్స్/ పాస్‌పోర్టు, పొలానికి సంబంధించిన అడంగల్ డాక్యుమెంట్లు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో ఇవ్వాలి.
దరఖాస్తు ఎలా చేసుకోవాలి?
తెలంగాణలో అయితే .. కామన్ సర్వీస్ సెంటర్లలో(మీసేవా కేంద్రాలు) దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో అయితే గ్రామ సచివాలయం లేదా రైతు భరోసా కేంద్రాల్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే పీఎం కిసాన్ వెబ్‌సైట్లో https://pmkisan.gov.in/ కూడా ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఏమైనా సందేహలు ఉంటే పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో ఉన్న 155261/011-24300606 హెల్ప్‌లైన్ నంబర్స్‌కు ఫోన్ చేయవచ్చు .