కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా(Priyanka Gandhi).. కేరళ వయనాడ్(Wayanad) లోక్‌సభ ఎన్నికలతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి సిద్ధమయ్యారు. పార్టీ సీనియర్ నేతలు వెంట రాగా ఇటీవలే తన నామినేషన్‌ను కూడా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వయనాడ్ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి భావోద్వేగభరిత పోస్ట్ చేశారు. తనకు ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రమే కొత్త అని పోరాటం చేయడం కాదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారామే.
‘‘నా సోదరుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై మీరు ఎంతో ప్రేమను, అభిమానాన్ని కురిపించారు. అదే ప్రేమ, అభిమానాన్ని నాపై కూడా చూపుతారని భావిస్తున్నా. చట్టసభలో మీ గళాన్ని వినిపించే సువర్ణ అవకాశాన్ని నాకు కల్పిస్తారని, కల్పించాలని కోరుకుంటున్నా. చిన్నారుల భవిష్యత్తు, మహిళల శ్రేయస్సు కోసం శక్తి వంచన లేకుండా శ్రమిస్తానని మాటిస్తున్నా. ప్రజాప్రతినిధిగా పోటీ చేసే ప్రయాణం నాకు కొత్త కావొచ్చు. కానీ ప్రజల తరపున గళాన్ని వినిపించడానికి చేసే పోరాటం కాదు. ఈ ప్రయాణంలో మీరంతా నాకు మార్గదర్శకంగా నిలుస్తారని ఆశిస్తున్నా’’ అని ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.