వయనాడ్(Wayanad) లోక్‌సభ ఉపఎన్నికలో భారీ మెజార్టీతో విజయం సాధించారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi). ఆమె ఈరోజు తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. సోదరుడు, ఎంపీ రాహుల్ గాంధీ సహా పార్టీ నేతలు పలువురు వెంట రాగా.. కేరళ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే ‘కసావు’ చీరలో(Kasavu Saree) ప్రియాంక సభలోకి విచ్చేశారు.
ఈరోజు లోక్‌సభ చర్చలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఓం బిర్లా(Om Birla).. కొత్తగా ఎన్నికైన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగానే రాజ్యాంగాన్ని చేతబట్టుకుని ప్రియాంక తన ప్రమాణ స్వీకారాన్ని పూర్తి చేశారు. రాజకీయాల్లో ఎంతో కాలం నుంచి ఉన్నప్పటికీ ఈ ఏడాది ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు.
వచ్చీ రావడంతోనే వయనాడ్ ఎంపీ ఉపఎన్నికలో ఘన విజయం సాధించారు. తన సోదరుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) సాధించిన 3.64లక్షల మెజార్టీని సైతం అధిగమించారు. ఈ ఉపఎన్నికలో ప్రియాంక 4,10,931 మెజార్టీతో విజయం సాధించారు. ఈ విజయంతో గాంధీ-నెహ్రూ కుటుంబంలో దక్షిణాది నుంచి ప్రాతినిధ్యం వహించి లోక్‌సభలో అడుగుపెట్టిన మూడో వ్యక్తిగా ప్రియాంక(Priyanka Gandhi) గుర్తింపు పొందారు.
అయితే సోనియా గాంధీ కూడా కర్ణాటకలోని బళ్లారి నుంచి పోటీ చేసి విజయం సాధించినప్పటికీ, ఆ తర్వాత అమేఠీలో కూడా గెలవడంతో బళ్లారి స్థానాన్ని వదులుకున్నారు. ఇప్పుడు ప్రియాంక కూడా లోక్‌సభకు రావడంతో ఒకేసారి గాంధీ-నెహ్రూ కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు పార్లమెంటు ఎంపీలుగా కొనసాగుతున్నారు.