తెలుగు భాషపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ భాష అయినా.. దానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుందని అన్నారు. ప్రస్తుతం భారత్‌లో నడుస్తున్న భాష వివాదంపై ఆయన అమెరికా డాలస్‌లోని టెక్సాస్ యూనివర్సిటీలో విద్యార్థులతో మాట్లాడుతూ ప్రస్తావించారు. ప్రతి భాషకు ఒక ప్రత్యేకత ఉంటుందన్నారు. భాష అనేది కేవలం మనం మాట్లాడుకునే అక్షరాల, పదాల సమాహారం మాత్రమే కాదని, భాష అంటే కోట్ల మంది సంప్రదాయం, సంస్కృతి, ప్రజలు అని రాహుల్ గాంధీ వివరించారు. భారతదేశ జాతీయ గీతం ‘జనగనమన’ను తీసుకుంటే.. అది కూడా అన్ని రాష్ట్రాలను సమానంగా చెప్తుందే తప్ప ఆ రాష్ట్రం గొప్ప, ఈ రాష్ట్రం తక్కువ అని చెప్పదని గుర్తు చేశారు.
‘‘తమిళం మాట్లాడేవారు మాకు నచ్చరు.. హిందీ మాట్లాడే వారే మాకు ఇష్టమని అనడం సరికాదు. ఉదాహరణకు తెలుగు భాషనే తీసుకోండి. తెలుగు అంటే కేవలం భాష కాదు.. ఒక చరిత్ర, ఒక సంప్రదాయం, ఒక సంస్కృతి. హిందీతో పోలిస్తే తెలుగు భాష అంత ముఖ్యం కాదని ఎవరైనా అంటే అది ఆ రాష్ట్ర ప్రజలను అవమానించడమే. అలాంటి పోలిక చేస్తే తెలుగు భాష చరిత్ర, సంస్కృతి, పూర్వీకులు ఇవేవీ ముఖ్యం కాదని చెప్పడమే అవుతుంది’’ అని Rahul Gandhi వ్యాఖ్యానించారు. కాగా ఆయన వ్యాఖ్యలను బీజేపీ, ఆర్ఎస్ఎస్ తీవ్రంగా ఖండించాయి. విదేశీ గడ్డపై భారత్‌కు వ్యతిరేకంగా, భారత్‌కు అవమానించేలా మాట్లాడటం ఏంటని మండిపడ్డాయి.