TN car explosion:తమిళనాడు కోయంబత్తూర్‌లో ఆదివారం జరిగిన కారు పేలుడు ఆ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తుంది. ఈ ఘటనలో జమేషా ముబీన్ అనే వ్యక్తి మరణించాడు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ప్రస్తుతం ఈ కేసులో ఐదుగురిని అదుపులోకి తీసుకుంది. ముహమ్మద్ తల్కా, ముహమ్మద్ అజారుద్దీన్, మహ్మద్ రియాజ్, ఫిరోజ్ ఇస్మాయిల్, ముహమ్మద్ నవాజ్ ఇస్మాయిల్‌గా గుర్తించామని.. వారివద్ద నుంచి పొటాషియం నైట్రేట్ అనే పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నాట్లు వెల్లడించారు. పేలుడు ఘటనలో మృతి చెందిన ముబీన్ ఇంట్లో నుంచి కూడా పొటాషియం నైట్రేట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఢిల్లీ నుంచి ఈ ఘటనపై విచారణ కోసం ఎన్‌ఐఏ అధికారులు కోయంబత్తూరు చేరుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా ఈ ఘటనపై ప్రతిపక్షాలు స్టాలిన్ సర్కారుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రాష్ట్ర నిఘా వ్యవస్థ విఫలం అయ్యిందంటూ దుయ్యబడుతున్నారు. సీఎం స్టాలిన్ తన వైఫల్యాల నుంచి దాక్కోవటం మానేసి బయటకు రావాలని ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీఎంకే అధికారం చేపట్టినప్పుడల్లా బాంబు పేలుళ్లు ఘటనలు పునరావృతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.