కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) ఈనెల 28న తెలంగాణ పర్యటనకి రావాల్సి ఉంది. అయితే ఈ పర్యటన వాయిదా పడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కొన్ని అత్యవసర పనుల కారణంగా ఆయన పర్యటన రద్దైనట్టు తెలుస్తోంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అమిత్ షా రేపు హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించాలి. కానీ ఆయన పర్యటన వాయిదా పడడంతో జిల్లాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి. అయితే బీహార్ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే అమిత్ షా పర్యటన క్యాన్సిల్ అయినట్టు సమాచారం.
సార్వత్రిక ఎన్నికల బీహార్(Bihar) లో జరుగుతోన్న రాజకీయ పరిణామాలు తమకి కలిసి వచ్చే అంశంగా బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్జేడీ, నితీష్ కుమార్(Nitish Kumar) ప్రభుత్వంలో చెలరేగిన అలజడితో బీహార్ రాజకీయాలు దేశవ్యాప్తంగా సంచలనం అయ్యాయి. కొంతకాలంగా విపక్ష ఇండియా కూటమిపై నితీష్ కుమార్ అసంతృప్తితో ఉన్నారు. ఆయనను కన్వీనర్ గా ప్రకటించాలనే నిర్ణయాన్ని రాహుల్ గాంధీ పోస్ట్ పోన్ చేయాలని కోరారు. బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సైతం ఈ నిర్ణయంపై టీఎంసీ చీఫ్ మమత బెనర్జీ అంగీకారం కావాలని పట్టుబట్టారు. దీంతో హర్ట్ అయిన నితీష్ కుమార్ ఇండియా కూటమి నుండి బయటకి వచ్చి ఎన్డీయేతో దోస్తీ కట్టాలని ఫిక్స్ అయ్యారు. ఒక బలమైన పార్టీ తమ కూటమిలో చేరితే పార్టీకి మరింత బలం చేకూరుతుంది అని భావించిన బీజేపీ అటువైపు ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే అమిత్ షా(Amit Shah) బీహార్ వెళ్లనున్నారని రాజకీయ వర్గాల సమాచారం.