రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో ఫైబర్ (Jio Fiber), ఎయిర్ ఫైబర్ (AirFiber), పోస్ట్ పెయిడ్ వినియోగదారులకి రెండు సంవత్సరాల ఉచిత యూట్యూబ్ ప్రీమియం(Youtube Premium) ఆఫర్‌ను ప్రారంభించింది. యాడ్ ఫ్రీ వీడియోలు, ఆఫ్ లైన్ డౌన్‌లోడ్ లు, బ్యాక్ గ్రౌండ్ ప్లే యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లకి ఫ్రీగా అందించనుంది. అయితే ఈ ఆఫర్ కేవలం రూ.888, అంతకంటే ఎక్కువ విలువైన ప్లాన్ లపై మాత్రమే వర్తిస్తుంది. వినియోగదారుల నుండి వచ్చిన అనేక ఫిర్యాదుల నేపథ్యంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు.
Jio Fiber | ఇటీవల ఎక్కువసార్లు స్కిప్ చేయలేని యాడ్స్ ప్లే అవుతుండటం యూట్యూబ్ యూజర్లకు చిర్రెత్తిస్తోంది. దీంతో ఫిర్యాదులు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇక తమ కస్టమర్లకి మరింత మెరుగైన యూట్యూబ్ అనుభవాన్ని ఇవ్వడానికి జియో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రీమియం ఉన్న వినియోగదారులు ఇప్పుడు ప్లేలిస్టులు, పాడ్ క్యాస్ట్ లను వింటూ వారు కోరుకున్న విధంగా మల్టీ టాస్క్ చేయవచ్చు అని సంస్థ వెల్లడించింది. ఈ ఆఫర్ రీడీమ్ చేయడం కూడా సులభం. జియో యూజర్లు MyJio కి లాగిన్ అయ్యి, యూట్యూబ్ ప్రీమియం కోసం బ్యానర్ పై క్లిక్ చేయాలి. దీంతో యూజర్లు తమ యూట్యూబ్ అకౌంట్ ని జత చేసేయొచ్చు.