ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ(Anil Ambani)కి ఎదురు దెబ్బ తగిలింది. ఆయనతో పాటు మరో 24 సంస్థలకు సెబీ(SEBI) షాక్ ఇచ్చింది. సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి ఐదేళ్లపాటు నిషేధం విధించింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్(Reliance Home Finance) లో కీలకంగా వ్యవహరించిన మాజీ అధికారులకు, మరో 24 సంస్థలకు నిషేధాన్ని వర్తింపజేస్తున్నట్టు సెబీ ప్రకటించింది. నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నట్టు వెల్లడించింది. అనిల్ అంబానీ పై సెబీ రూ. 25 కోట్ల జరిమానా కూడా విధించింది.
సెక్యూరిటీ మార్కెట్లతో సంబంధం ఉండే ఎలాంటి కార్యకలాపాలలోనూ పాల్గొన వద్దని ఆంక్షలు విధించింది. ఏ నమోదిత కంపెనీ సెబీలో రిజిస్టర్ అయిన మధ్యవర్తిత్వ సంస్థల్లో డైరెక్టర్ తో సహా ఎలాంటి కీలక పదవుల్లో ఉండకూడదని ఆదేశించింది. అనిల్ ధీరుభాయి అంబానీ గ్రూప్ కి చెందిన కీ మేనేజెరల్ పర్సనల్ కి కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయని సెబి స్పష్టం చేసింది. అనిల్ అంబానీ తన అనుబంధ సంస్థలకు రుణాల రూపంలో ఆర్ హెచ్ ఎఫ్ ఎల్ నిధులను మళ్లించారని సెబీ తన నివేదికలో వెల్లడించింది. దీనికోసం కంపెనీకి చెందిన కీలక నిర్వహణ అధికారులతో కలిసి కుట్ర పన్నారని ఆరోపించింది. ఆర్ హెచ్ ఎఫ్ ఎల్ డైరెక్టర్ల బోర్డు నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ వాటిని యాజమాన్యం బేఖాతరు చేసినట్టు తెలిపింది. అనిల్ ప్రభావంతోనే కీలక అధికారులు నిబంధనలు అతిక్రమించారని పేర్కొంది. దీంతో సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి అనిల్(Anil Ambani) ను ఐదేళ్లపాటు నిషేధించింది.