ఢిల్లీలోని పాఠశాలలకు మరోసారి బాంబు బెదిరింపులు(Bomb Threats) రావడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. దాదాపు 40కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మెయిల్ ద్వారా ఈ బెదిరింపులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సదరు స్కూళ్లలో తనిఖీలు చేపట్టారు. ప్రతి అంగుళం క్షుణ్ణంగా పరిశీలించారు.
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యార్థులను ఇళ్లకు పంపించేశారు. కొన్ని పాఠశాలలకు ఈరోజు ఉదయం బెదిరింపులు రాగా.. కొన్నింటికి ఆదివారం రాత్రే బెదిరింపులు వచ్చినట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. పాఠశాలల ఆవరణలో పేలుడు పదార్తాలు పెట్టామని, వాటిని పేల్చకూడదంటే 30 వేల డాలర్లు ఇవ్వాలని ఈ-మెయిల్స్ పేర్కొన్నాయి.
Read Also: రైతుల పాదయాత్రను అడ్డుకున్న భద్రతా బలగాలు..
రంగంలోకి దిగిన పోలీసులు.. డాగ్ స్క్వాడ్, బాంబు డిస్పోసల్ బృందాలతో సోదాలు చేశారు. పాఠశాలలు పూర్తిగా తనిఖీ చేసిన అధికారులు.. ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదని పోలీసులు పేర్కొన్నారు. కాగా బెదిరింపు మెయిల్స్ వచ్చిన ఐపీ అడ్రస్ ఆధారంగా ఆగంతుకులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు అధికారులు.
ఈ ఏడాది ఆరంభంలో ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు(Bomb Threats) వచ్చాయి. ఈ ఏడాది పాఠశాలలు సహా విమానాలకు కూడా భారీ సంఖ్యలో బాంబు బెదిరింపులు రావడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దష్టి సారించిందని, ఎట్టిపరిస్థితుల్లో ఆగంతుకులను పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడంపై విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
Follow us on: Google News, Twitter, ShareChat