మహారాష్ట్రలో ఏర్పడిన ప్రతిపక్ష పార్టీల కూటమి మహా వికాస్ అఘాడిలో సమస్యలు మొదలైనట్లే కనిపిస్తోంది. కాంగ్రెస్, శివసేన(యూబీటీ) మధ్య మనస్పర్థలు, అభిప్రాయబేధాలు మొదలయ్యాయనే సంకేతాలను తాజా వాతావరణం చెప్పకనే చెప్తోంది. తాజాగా కాంగ్రెస్ శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్.. కాంగ్రెస్ కు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. కాంగ్రెస్ తమ పద్దతి మార్చుకోకుంటే తాము కూడా అదే తప్పు చేయాల్సి వస్తోందని సంజయ్ రౌత్(Sanjay Raut) హెచ్చరించారు. మహారాష్ట్రలో సోలాపూర్ సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ పడే తమ అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించడమే ఈ సమస్యకు పునాదిగా మారింది. కాంగ్రెస్ కన్నా ముందే శివసేన సోలాపూర్ అభ్యర్థిని ప్రకటించి ఉంది. మళ్ళీ అదే స్థానానికి కాంగ్రెస్ కూడా తమ అభ్యర్థిని ప్రకటించడం కూటమిలో చీలికలకు పునాది వేసినట్లు మారింది. దీనిపై స్పందిస్తూనే సంజయ్ రౌత్ మండిపడ్డారు.
‘‘మేము ఇప్పటికే సోలాపుర్ సౌత్ అభ్యర్థిగా అమర్ పాటిల్(Amar Patil)ను ప్రకటించాం. ఇప్పుడు అదే స్థానానికి కాంగ్రెస్.. దిలీప్ మానేను తమ అభ్యర్థిగా బరిలోకి దించుతున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో ఈ విధంగా ఉండటం బహుశా టైమింగ్ మిస్టేక్ అయి ఉండొచ్చు. మా వైపు నుంచి కూడా అలానే తప్పు జరిగి ఉండే అవకాశం ఉంది. కానీ ఇటువంటి చర్యల వల్ల మహా వికాస్ అఘాడిలో సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. సీట్ సర్దుబాటులో భాగంగా యూబీటీ పోటీ చేయాలని నిర్ణయించుకున్న స్థానం నుంచి కాంగ్రెస్ కూడా పోటీ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం వచ్చింది. మిత్రపక్షాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఈ ఆలోచనలు సరైనవి కాదు’’ అని సంజయ్ రౌత్(Sanjay Raut) హెచ్చరించారు.