Sonia Gandhi |కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ శనివారం తాను రాజకీయాల నుంచి తప్పుకోవడం గురించి ప్రస్తావించారు. తన ఇన్నింగ్స్‌ను భారత్ జోడో యాత్రతో ముగించవచ్చని సంచలన ప్రకటన చేశారు. భారత్ జోడో యాత్ర పార్టీలో కీలక మలుపు తీసుకువచ్చిందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగిన పార్టీ మూడు రోజుల మేధోమథన సదస్సులో సోనియాగాంధీ మాట్లాడారు. రెండవ రోజు 15,000 మంది ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించిన ఆమె.. “నాకు చాలా సంతోషాన్నిచ్చే విషయం ఏమిటంటే, నా ఇన్నింగ్స్ భారత్ జోడో యాత్రతో ముగియగలదు. యాత్ర ఒక మలుపు తిరిగింది. భారతదేశ ప్రజలు సామరస్యం, సహనం, సమానత్వాన్ని ఎక్కువగా కోరుకుంటున్నారని ఇది రుజువు చేసింది” అని సోనియాగాంధీ(Sonia Gandhi) అన్నారు. కాగా నా ఇన్నింగ్స్ జోడో యాత్రతో ముగియనుందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.