ప్రముఖ ఉన్నత విద్యాసంస్థ ఐఐటీ బాంబే(IIT Bombay)లో ఓ వ్యవహారం కలకలం రేపింది. వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ విద్యార్థుల మధ్య వార్.. క్యాంపస్ లో దుమారం రాజేసింది. నాన్ వెజ్ తినే విద్యార్థులపై వివక్ష చూపుతున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్యాంటీన్లో ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన గొడవ ఈ వివాదానికి తెరలేపినట్లు తెలుస్తోంది. ఈ వివాదం కాస్త చిలికి చిలికి గాలివానై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఐఐటీ బాంబే(IIT Bombay) క్యాంపస్ లోని క్యాంటీన్ లో మాంసాహారం తిన్న విద్యార్థిని.. శాఖాహారి అయిన మరో విద్యార్థి అవమానించాడు. దీంతో వారిద్దరి మధ్యన ఆర్గ్యుమెంట్ జరిగింది. ఇది కాస్త మాంసాహారులు, శాఖాహారులు అంటూ వివాదం తలెత్తింది. క్యాంటీన్ గోడలపై మాంసాహారం తినేవారికి ఇక్కడ అనుమతి లేదని, శాకాహారం తినే వారికి మాత్రమే ఇక్కడ కూర్చునే అర్హత ఉందంటూ పోస్టర్లు వెలిశాయి. మాంసాహారం తినే విద్యార్థులు అక్కడ కూర్చుంటే వారిని బలవంతంగా అక్కడి నుంచి పంపిస్తున్నారని ఆరోపణలు కూడా వెలువత్తుతున్నాయి.
ఈ వ్యవహారంపై స్పందించిన అంబేద్కర్ పెరియార్ పూలే స్టడీ సర్కిల్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. సమాచార హక్కు చట్టం ద్వారా వివరణ కోరగా వచ్చిన సమాధానాన్ని ట్విట్టర్ లో షేర్ చేసింది. వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ అంటూ ఐఐటి బాంబే క్యాంటీన్లో ఎలాంటి వివక్ష లేదని సమాధానం వచ్చినట్లు స్టడీ సర్కిల్ తెలిపింది. కానీ కొందరు మాత్రం వివక్ష చూపిస్తున్నారని, శాఖాహారులకు మాత్రమే అక్కడ కూర్చుని అవకాశం ఉందని పోస్టర్లు అంటిస్తున్నారని, ఇతరులు కూర్చుంటే వారిని బలవంతంగా పంపించేస్తున్నారని మండిపడింది. ఈ పోస్ట్ పైన నిడజనులు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి పోస్టర్లు వేయడం అట్టడుగు వర్గాలను అవమానించడమే అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.