Manipur Violence | మణిపూర్ ఘటనలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంత జరుగుతుంటే మణిపూర్ పోలీసులు ఏం చేశారని ప్రశ్నించింది. వీడియోలు బయటకు వచ్చే వరకు ఏం చేస్తున్నారని నిలదీసింది. బాధిత మహిళలు దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మే 3న అల్లర్లు జరిగితే ఇప్పటి వరకు ఎన్ని ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారని ప్రశ్నించింది.
మణిపూర్ అల్లర్ల(Manipur Violence) వ్యవహారంలో ప్రభుత్వం ఏమీ దాచిపెట్టలేదని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహత కోర్టుకు తెలిపారు. విచారణను సుప్రీంకోర్టు పర్యవేక్షించవచ్చన్నారు. బాధితుల తరపున కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. అస్సాం వేదికగా సీబీఐ విచారణను కపిల్ సిబాల్ వ్యతిరేకించారు. కేసు విచారణ వేరే రాష్ట్రానికి తరలించాలని డిమాండ్ చేశారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం మణిపూర్ హింసపై దర్యాప్తు కోసం మహిళా న్యాయమూర్తితో సిట్ ఏర్పాటు చేసింది. అనంతరం తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.