ఎలక్టోరల్ బాండ్లు(Electoral Bonds) రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం క్విడ్ ప్రోకోకి దారి తీస్తుందని వ్యాఖ్యానించింది. నల్లధనం నిర్మూలనకు ఎలక్టోరల్ బాండ్స్ ఒక్కటే మార్గం కాదని సూచించింది. ఇది కచ్చితంగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని పేర్కొంది. ఆర్టికల్ 19(1)(ఏ)తో పాటు సమాచార హక్కు చట్టానికి ఈ బాండ్లు విఘాతం కల్గిస్తున్నాయని స్పష్టంచేసింది.
చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. ఎలక్టోరల్ బాండ్స్(Electoral Bonds) జారీ చేయడాన్ని తక్షణమే నిలిపేయాలని ఎస్బీఐని ఆదేశించింది. 2019 ఏప్రిల్ 19 నుంచి ఎలక్టోరల్ బాండ్స్ కొన్న వారి వివరాలను ఈసీకి సమర్పించాలని సూచించింది. మార్చి 31లోపు ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచాలని తెలిపింది.
కాగా, 2018 జనవరి 2న కేంద్ర ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్లు స్కీమ్‌ని తీసుకొచ్చింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు సేకరించాలంటే ఆ పార్టీలకు ఎన్నికల్లో కనీసం ఒక్క శాతం ఓట్లు వచ్చి ఉండాలి. ఈ బాండ్ల ద్వారా గత ఆరున్నర ఏళ్లలో రూ.9,188 కోట్లకు పైగా విరాళాలను ఆయా పార్టీలు సేకరించాయి. అత్యధికంగా బీజేపీకి విరాళాలు వచ్చాయి. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్‌లు వేశారు. ఈ పిటిషన్లపై సుదీర్ఘంగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెల్లడించింది.
Read Also: ఆరోసారి ఈడీ నోటీసులు అందుకున్న CM కేజ్రీవాల్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat