ఆర్టికల్ 370(Article 370) రద్దుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. కేంద్రం నిర్ణయం సరైనదేనని.. ఇందులో జోక్యం చేసుకోలేమని స్పష్టంచేసింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ కీలక తీర్పు వెల్లడించింది. జమ్ముకశ్మీర్ భారత్‌లో విలీనం అయినప్పుడు ప్రత్యేక హోదాలు లేవని ప్రకటించింది. కేవలం నాటి ప్రత్యేక పరిస్థితులు, యుద్ధం కారణంగానే ఆర్టికల్ 370 అమలు చేశారని తేల్చిచెప్పింది.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో జమ్ముకశ్మీర్(Jammu Kashmir)లో భద్రతను కట్టుదిట్టం చేశారు. హింస చెలరేగే ప్రమాదం ఉండటంతో గత రెండు వారాల ముందుగానే కశ్మీర్ లోయకు భారీ సంఖ్యలో వెళ్లిన పోలీసులు.. అక్కడి 10 జిల్లాలను తమ కంట్రోల్‌లోకి తీసుకున్నారు. కాగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం 2019లో Article 370 రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్రం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.