బిల్కిస్ బానో కేసు(Bilkis Bano Case)లో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో 11 మంది నిందితులకు తిరిగి జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిందితుల విడుదలై గతంలో గుజరాత్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బాధితురాలు బిల్కిస్ బానో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆమె పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ బీవీ నాగరత్నం, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెల్లడించింది. 11 మంది నిందితులు రెండు వారాల్లోగా జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
అసలు ఏం జరిగింది..?
Bilkis Bano Case | 2002లో గోద్రా రైలు దహనం ఘటన తర్వాత జరిగిన గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిన్ బానో కుటుంబంపై దుండుగులు దాడి చేశారు. చిన్నా పెద్దా అనే కనికరం లేకుండా నిర్దాక్షిణ్యంగా ఏడుగురిని హత్య చేశారు. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణీ అని కూడా చూడకుండా బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 2008లో సీబీఐ స్పెషల్ కోర్టు నిందితులకు జీవిత ఖైదు శిక్ష విధించింది. అయితే కొంతకాలం తర్వాత ఓ నిందితుడు తన విడుదలపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం అతడి విజ్ఞప్తిని పరిశీలించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సిఫార్సు మేరకు 2022 ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం నిందితులను జైలు నుంచి విడుదల చేసింది. అయితే ప్రభుత్వం నిర్ణయాన్ని బిల్కిస్ బానో సుప్రీంకోర్టులో సవాల్ చేయగా తాజా తీర్పును న్యాయస్థానం ఇచ్చింది.