భారతదేశం ప్రతిభల భాండాగారమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చెప్పారు. కానీ ఇంత ప్రతిభ ఉన్నా భారత్‌లో దానికి ఏమాత్రం విలువ లేకపోవడం బాధాకరమన్నారు. ప్రతిభ ఉన్నవారిని తొక్కేయడానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తారంటూ విమర్శలు గుప్పించారు. ఇందుకు ఏకలవ్యుడి కథను గుర్తు చేశారు. పురాణాల్లో చెప్పినట్లు అత్యంత ప్రతిభావంతుడైన ఏకలవ్యుడి దగ్గర నుంచి ద్రోణాచార్యుడు గురుదక్షిణగా బొటవేలు తీసుకున్నాడని, ఇలాంటి ఘటనలు మన దేశంలో ప్రతి రోజూ లక్షల కొద్దీ జరుగుతున్నాయని అన్నారు. తమకున్న ప్రతిభను ప్రదర్శించడానికి యువతకు ఏమాత్రం ఆస్కారం కల్పించడం లేదని చెప్పారు. నాలుగు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా డాలస్‌లో టెక్సాస్ యూనివర్సిటీ విద్యార్థులతో ముచ్చటిస్తూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్‌లో ప్రతిభావంతుల్ని పనిచేసుకోవడానికి అనుమతించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తయారీ రంగంలో ఆధిపత్యం వల్లే చైనాలో నిరుద్యోగం లేదని, భారీ స్థాయి ఉపాధి కల్పన జరగాలంటే భారత్ కూడా తయారీ రంగంపై దృష్టి పెట్టి తీరాలని అభిప్రాయపడ్డారు. భారత్, అమెరికా, ఐరోపా, పాశ్చాత్య దేశాలు ఉత్పాదకరంగ ఆలోచనను వదిలేసి, దానిని చైనాకు అప్పజెప్పాయని అన్నారు. ఇప్పటికైనా భారత్ కళ్లు తెరిచి దేశ అభివృద్ధి కోసం ప్రతిభకు పెద్దపీట వేయడం నేర్చుకోవాలని Rahul Gandhi సూచించారు.