కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాల కూటమిపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాల కూటమిని ‘ఇండియా’అని కాకుండా ‘గమాండియా (అహంకారం)’అని పిలవాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. దేశాన్ని దోచుకోవాలనే ఉద్దేశంతోనే విపక్షాలు తమ కూటమి పేరును ‘ఇండియా’గా మార్చుకున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. పేదలకు వ్యతిరేకంగా ఎలా కుట్రలు చేశారనే విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికే విపక్షాలు తమ కూటమికి ఇండియాగా నామకరణం చేశాయని ఆరోపించారు. గతంలో కూడా పలు సందర్బాల్లో కూడా ఇండియా కూటమిపై తీవ్రవిమర్శలు చేశారు.
ఇక ఇండియా పేరు పెట్టుకున్నంత మాత్రాన దేశ భక్తులు కాలేరని ఇటీవల మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. ఈస్టిండియా కంపెనీ పేరులోనూ ఇండియా… ఉగ్రసంస్థలు ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా’, ‘ఇండియన్ ముజాహిద్దిన్’ల పేర్లలోనూ ఇండియా పేరు ఉందని ఎద్దేవా చేశారు. ప్రజా సంక్షేమం కోసం ఎవరు పని చేస్తున్నారనే విషయం దేశ ప్రజలకు తెలుసని.. విపక్షాలకు ఓ దశ-దిశ లేదని దుయ్యాబట్టారు. మరోవైపు విపక్ష కూటమికి ‘ఇండియా’ పేరు పెట్టుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం కేంద్రహోంశాఖ, విపక్ష కూటమి సభ్యులకు నోటీసులు జారీ చేసింది.