ఆంగ్ల నూతన సంవత్సరం వేళ రైతుల కోసం కేంద్ర క్యాబినెట్(Union Cabinet) కీలక నిర్ణయాలు తీసుకుంది. పంటల బీమా పథకం అయినా ప్రధానమంత్రి ‘ఫసల్ బీమా యోజన’ను మరింత మెరుగుపరచాలని నిర్ణయించింది. ఈ పథకం రైతుల జీవితంలో ఘణనీయమైన మార్పులు తెచ్చిందని భావిస్తోన్న కేంద్ర ప్రభుత్వం… కేటాయింపులను రూ. 69,515 కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో పంటలు వేసిన రైతులకు మరింత రక్షణ కల్పించడంతోపాటు నష్టాల ఆందోళన తగ్గనుంది. ఫసల్ బీమా యోజనతో నాలుగు కోట్ల మంది రైతులు లబ్ధి పొందనున్నారు.
మరోవైపు 50 కిలోల డిఏపి ఎరువుల బస్తాను రూ.1,350కి రైతులకు అందజేయడం కోసం కోసం రూ.3,850 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీకి రూ.800 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపింది. 2014 నుంచి 2024 వరకు ఎరువులు సబ్సిడీకి రూ. 11.9 లక్షల కోట్లు ఖర్చు చేసిన బీజేపీ సర్కార్.. మూడవసారి 2024లో అధికారంలోకి వచ్చాక ఇప్పుడు రైతుల కోసం రూ.6 లక్షల కోట్లతో 23 కీలక నిర్ణయాలు తీసుకుంది.
రైతుల కోసం తీసుకున్న క్యాబినెట్(Union Cabinet) నిర్ణయాలపై ప్రధానమంత్రి మోడీ ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని వెల్లడించారు. దేశానికి అన్నం పెట్టేందుకు శ్రమించే మన రైతులు గర్వకారణమని మోడీ కొనియాడారు. 2025 మొదటి క్యాబినెట్ భేటీని రైతుల శ్రేయస్సు కోసం అంకితం చేశామని గుర్తు చేశారు.