జ్ఞానవాపి(Gyanvapi) మసీదు వివాదం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మసీదు దక్షిణ ప్రాంతం ఆవరణలో హిందువులు పూజలు చేసుకోవచ్చని వారణాసి జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పూజలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను వారం రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో హిందువుల తరపున అడ్వకేట్ విష్ణు శంకర్ జైన్ వాదించారు. మసీదు లోపల పూజలు చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని స్పష్టంచేశారు. ఆయన వాదనలపై సానుకూలంగా స్పందించిన కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
కోర్టు తీర్పుపై స్పందించిన కాశీ విశ్వనాథ్ ట్రస్ట్.. హిందువులకు అతిపెద్ద విజయమని సంతోషం వ్యక్తం చేసింది. వారం రోజుల్లో జ్ఞానవాపి(Gyanvapi) మసీదు ప్రాంగణంలో శివుడికి పూజలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. కాగా ఇటీవల జ్ఞానవాపి ప్రాంగణంలో సర్వే నిర్వహించిన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా.. ప్రస్తుతం మసీదు ఉన్న ప్రాంతంలో గతంలో ఒక భారీ హిందూ ఆలయం ఉండేదని తేల్చింది. ఆ ఆలయాన్ని వాటి శిథిలాలతోనే మసీదు(Mosque) నిర్మించారని నివేదికను వెలువరించింది. ఈ తరుణంలోనే మసీదు ప్రాంగణంలో హిందువులు పూజలు చేసుకునేందుకు కోర్టు(Varanasi Court) అనుమతులు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. న్యాయస్థానం ఆదేశాలపై హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ తరఫు న్యాయవాది అఖ్లాక్ అహ్మద్.. కోర్టు ఉత్తర్వులను హైకోర్టులో సవాల్ చేస్తామన్నారు.