హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ రెజ్లర్ వినేష్ ఫోగట్(Vinesh Phogat) ఘన విజయం సాధించారు. 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హత వేటుకు గురై ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి వెనుదిరిగిన ఈమె.. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని చిత్తు చేసి శభాష్ అనిపించుంటున్నారు. జులానా స్థానం నుంచి కాంగ్రెస్ తరపున వినేష్ ఫోగట్, బీజేపీ తరపున యోగేష్ బైరాగి బరిలో ఉన్నారు. ఈరోజు కౌంటింగ్ సమయంలో 4వ రౌండ్ లెక్కింపు సమయంలో వినేష్ ఫోగట్.. జింద్ కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయారు. 4వ రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యే సమయానికి ఆమె 3వేల ఓట్ల వెనుకంజలో ఉన్నారు. దీంతో వినేష్ ఓడిపోవడం ఖాయమని అంతా అనుకున్నారు. బైరాగి అనుచర వర్గం సంబరాలు కూడా ప్రారంభించేసింది. ఇంతలో ఫలితాలు తలకిందులయ్యాయి. 15వ రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యే సమాయానికి వినేష్ ఫోగట్ 4వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ లెక్కింపు తొలి రౌండ్ నుంచే వినేష్ ముందంజలో ఉన్నా.. మధ్యలో కాస్తంత కుదుపు వచ్చింది. మళ్ళీ 8వ రౌండ్ నుంచి వినేష్ పుంజుకుని చివరకు 4వేల మెజార్టీ సాధించారు.
ప్యారిస్ ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించాలన్న రెజ్లర్ వినేష్ ఫోగట్(Vinesh Phogat) కల నెరవేరలేదు. మరికొన్ని గంటల్లో ఫైనల్స్‌లో USA కు చెందిన సారా ఆన్ హిల్డెబ్రాండ్‌తో తలపడాల్సి ఉంది. ఇంతలో ఆమె ఉండాల్సిన బరువుకంటే 100 గ్రాములు ఎక్కువుగా ఉన్నట్లు తేలింది. రాత్రి అంతా బరువు తగ్గేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో అనర్హత వేటు పడింది. ఒలింపిక్స్‌లో వినేష్ ఫోగట్‌కు స్వర్ణం ఖాయమని భారతీయులంతా ఆకాంక్షించారు. కానీ అధిక బరువు ఆమె లక్ష్యాన్ని దూరంచేసింది. అయినా తన పోరాటం ఇంతటితో ఆగలేదని ఇదే ఆరంభమని ప్రకటించిన ఫోగట్.. రాజకీయ రంగప్రవేశం చేసి, ఎన్నికల బరిలో నిల్చుని ఘన విజయం సాధించడం ఇప్పుడు కీలకంగా మారింది.